వ్యాకరణం అంటే ఏమిటి.. ? దాని ప్రయోజనం ఏమిటి

వ్యాకరణం అంటే అర్దమయ్యేటట్లు చెప్పుకోవాలంటే  గ్రామర్ .  అర్దం మాట్లాడుకోవాలంటే వ్యాకృతి ఉన్నదే వ్యాకరణం అంటే… ఒక భాషలోని నియమ నిబంధనలను,  మార్పులను  తత్వాలను నిర్ణయిస్తూ విశ్లేషించేది వ్యాకరణం. శబ్ద శాస్త్త్రమే వ్యాకరణం. భాషలో లక్షణాలే ఆ భాషకు వ్యాకరణం అవుతుంది. గ్రాంథిక భాషకి లేదా కావ్యభాషకి సంబంధించింది వ్యాకరణం. కావ్యప్రయోగాల ఆధారంగా వ్యాకరణం వెలువడుతుంది కాబట్టి ”ప్రయోగ మూలం వ్యాకరణం” అంటారు. ఒక భాష శబ్దస్వరూప స్వభావాలను  వివరించేది అని అర్దం. వ్యాకరణ శాస్త్రం చాలా ప్రాచీనమైంది,ప్రసిద్ధ మైందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తిలేదు. తెలుగు వ్యాకరణం  తెలుగు  భాషకు ఎన్నో వ్యాకరణాలు వచ్చినా…అవన్నీ అసమగ్రాలుగా ఉండటంతో..పరవస్తు చిన్నయ ప్రాచీన వ్యాకరణ మర్యాదలతో సంస్కృతంలో సూత్రప్రాయణంగా తెలుగు వ్యాకరణం రచించారు. ఇదేకాక అతను సంస్కృత భాషలో పాండిత్యం సంపాదించాడు.  అనేక  ప్రాచీన లక్షణ గ్రంధాలను పరిశీలించి తెలుగు భారతము, భాగవతం మొదలైన గ్రంధాలలో ప్రయోగాలను తెలుసుకుని , తన అనుభవాన్ని జోడించి క్రమ పద్దతిలో తెలుగు సూత్రాలతో చాలా సులభ శైలిలో వివరణలతో బాల వ్యాకరణం రచించారు. ఈ చిన్నయ బాల వ్యాకరమే ఆ తర్వాత వచ్చిన వ్యాకరణ కర్తలకు అందరికీ ఆదారమైంది.  తెలుగులో వ్యాకరణ గ్రంధాలెన్ని వచ్చినా చిన్నయ సూరి రూపొందించిన బాల వ్యాకరణమే ఆదర్శగ్రంధంగా నిలిచింది. బాల వ్యాకరణం రావడానికి ముందు చిన్నయ సూరి పద్యాంధ్ర వ్యాకరణం, సంస్కృత సూత్రాంధ్ర వ్యాకరణం, ఆంధ్ర శబ్దశాసనం, శబ్దలక్షణ సంగ్రహం అనే వ్యాకరణ గ్రంధాలను రచించారు. పదమూడేళ్ళ కృషితో అవిశ్రాంత కృషితో వెలువడిన బాలవ్యాకరణం తెలుగుకు ప్రత్యేక వ్యాకరణ గ్రంధం అందించిన ఘనతను దక్కించుకున్నారు. 1858లో మొదటి ముద్రణ పొందిన బాల వ్యాకరణం తెలుగులో వచ్చిన వ్యాకరణాల్లో తలమానికం.వ్యాకరణం అధ్యయనం చేసేవారికి ఇదొక మూల గ్రంధం.

వ్యాకరణ శాస్త్రప్రయోజనం: వ్యాకరణం చదవక పోతే శబ్దస్వరూపం సరిగా తెలియదనీ అందు వల్ల ఉచ్చారణాదుల్లో పొరపాట్లు చేసే అవకాశం ఉందనీ అలాంటి పొరపాట్లు చేయకుండా  ఉండటానికి ప్రతి విద్యార్ధి తప్ప కుండా వ్యాకరణం చదవాలని  చెప్తారు. ముఖ్యంగా అనంతమైన శబ్దాల  స్వరూప స్వభావాల్ని తెలుసుకోవడానికీ,పదాలకున్న తత్వాన్ని  నిర్ణయించడానికి , అర్థ సందేహాల్ని నివృత్తి చేసుకోవడానికీ వ్యాకరణం దోహదం చేస్తుంది.ఇట్టి గొప్పప్రయోజనాలు గల వ్యాకరణశాస్త్రాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడం వల్ల భాషా స్థితిగతు లపై అవగాహన ఏర్పడుతుంది.